స్టార్టప్‌ల కేంద్రంగా టీ-హబ్‌ను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చుతున్నట్లు వస్తున్న వార్తలపై సీఎం రేవంత్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడారని తెలంగాణ సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను అందుబాటులో ఉన్న ఇతర ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు. టీ-హబ్‌ను ప్రత్యేకంగా స్టార్టప్‌ల కేంద్రంగానే గుర్తించాలని చెప్పారని స్పష్టం చేసింది. ఇంక్యుబేటర్‌గా, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌లకు కేంద్రంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌లో ఇతర కార్యాలయాలు ఉండకూడదని, అలాంటి ఆలోచనలు ఉంటే విరమించుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు పేర్కొంది.
బాలికల సాధికారతే ప్రగతిశీలమైన, సమగ్ర తెలంగాణ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు కీలకం
ఇక నేడు జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బాలికల సాధికారతే ప్రగతిశీలమైన, సమగ్ర తెలంగాణ నిర్మాణానికి, దేశ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. ప్రతి బాలికకు నాణ్యమైన విద్య, భద్రత, ఆరోగ్యం, సమాన అవకాశాలు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో నాయకత్వం వహించే అవకాశాలు కల్పించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047కు అనుగుణంగా, ప్రతి బాలిక తన సంపూర్ణ సామర్థ్యాన్ని సాకారం చేసుకొని రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో అర్థవంతమైన పాత్ర పోషించే భవిష్యత్తు దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.