తెలంగాణకు పెట్టుబడుల కల్పనే లక్ష్యంగా సీఎం రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 నిర్దేశిత లక్ష్యాలు, దార్శనికతను ప్రపంచానికి చాటడంలో ప్రతినిధి బృందం సఫలీకృతమైందని ముఖ్యమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది. హైదరాబాద్‌లో గత నెలలో జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించింది. ఆ నేపథ్యంలో WEF2026 లో పెట్టుబడులకు మించి రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు, సమగ్రాభివృద్ధిపై తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలు, బృహత్ ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరిందని తెలిపింది.
మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రతినిధి బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. అలాగే ప్రభుత్వం ఏఐ, సస్టైనబిలిటీ, స్కిల్లింగ్ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు (MoUలు) కుదుర్చుకుంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. #Davos2026 సదస్సు అనంతరం ఫాలోఅప్‌గా జూలై, ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ సదస్సులో చేసిన ప్రతిపాదనకు సానుకూల స్పందన లభించిందని తెలిపింది. ఈ మూడు రోజుల్లో ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.