తన గొయ్యి తానే తీసుకుంటున్న పాకిస్థాన్..ఎయిర్ స్పేస్ క్లోజ్!

ఏవియేషన్ సెక్టార్ లో ఎయిర్ స్పేస్ నేది చాలా కీలకం. ఒక దేశం మీదుగా ప్యాసింజర్ లేదా కార్గో విమానాలు వెళ్లాలంటే ఆయా దేశాలకు భారీగా పన్నులు కట్టాలి. పాకిస్థాన్ భౌగోళికంగా ఆసియా , యూరప్ ఖండాలను కలిపే ఒక కీలకమైన ప్రదేశంలో ఉంది. అందుకే ఆసియా దేశాల నుంచి యూరప్ వెళ్లే చాలా విమానాలు పాకిస్థాన్ మీదుగానే వెళ్తాయి. తైవాన్ విమానాలు కూడా దశాబ్దాలుగా ఇదే రూట్ ను ఫాలో అవుతున్నాయి. కానీ తాజాగా బ్లూమ్ బర్గ్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఒక సంచలన కథనాన్ని బయటపెట్టాయి. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. తైవాన్ కు చెందిన దిగ్గజ ఏవియేషన్ సంస్థలైన చైనా ఎయిర్ లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవా ఎయిర్ వేస్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన విమానాలు అక్టోబర్ 25 ఉదయం నుంచి పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రయాణించలేదు. పాక్ తీసుకున్న ఈ సడెన్ నిర్ణయంతో ఇప్పుడు ఆ విమానయాన సంస్థలు ఆసియా, యూరోప్ ఖండాల్లో ప్రయాణించడానికి ప్రత్యామ్నాయంగా ఆఫ్ఘనిస్తాన్ లేదా మరింత దూరం తిరిగి వెళ్లే కొత్త రూట్లను వెతుక్కుంటున్నాయి. దీంతో ప్రపంచంలో తైవాన్ ఎయిర్ లైన్స్ ను బ్యాన్ చేసిన మొట్టమొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచింది.
ఈ వివాదం అంతర్జాతీయంగా దుమారం రేపడంతో, పాకిస్థాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా అసిఫ్ .. బ్లూమ్ బర్గ్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. పాకిస్థాన్ ఏవియేషన్ సంస్థ వన్ చైనా పాలసీకి పూర్తిగా కట్టుబడి ఉంది. చైనా, తైవాన్ వేరు వేరు దేశాలు కావని, తైవాన్ చైనాలో అంతర్భాగమే అన్న చైనా నిర్ణయానికి మా సంపూర్ణ మద్దతు ఉంది. ఈ పాలసీలో భాగంగా పాకిస్థాన్ గగనతలం మీదుగా కేవలం మెయిన్ ల్యాండ్ చైనా నుంచి వచ్చే విమానాలకు, చైనీస్ ఎయిర్ లైన్స్ కు మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుంది. తైవాన్ ఎయిర్ లైన్స్ కు ఇకపై మా దేశంలో ఎంట్రీ లేదు అని ఒక రక్షణ మంత్రి స్థాయిలో ఉండి, వేరొక దేశం తరఫున వకాల్తా పుచ్చుకుని ఇంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది.



