పాకిస్థాన్ బరితెగింపు..రాజస్థాన్ రైల్వే ట్రాక్ పేలుడు కేసులో పాక్ కుట్ర

భారత్ పై కుట్రలకు పాక్ ఉగ్రభూతం తెగబడుతూనే ఉంది. ఎన్నిసార్లు చావుదెబ్బలు తిన్నా దాని బుద్ది మారడం లేదు. నేరుగా ఇండియాలోకి చొరబడకుండానే ఇక్కడి యువతను తమ పావులుగా ఉగ్రముఠాలు వాడుకుంటున్నాయి. రాజస్థాన్‌లో జరిగిన తాజా రైల్వే ట్రాక్ పేలుడు ఘటన ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది. రీసెంట్ గా రాజస్థాన్‌లోని రామ్సింగ్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై జరిగిన పేలుడు ఘటనపై లోతుగా దర్యాప్తు చేసిన రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ , పంజాబ్ పోలీసులు..ఒక షాకింగ్ నెట్‌వర్క్‌ను బట్టబయలు చేశారు. పంజాబ్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి నుంచి విదేశీ పిస్టళ్లు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ సరిహద్దు జిల్లా శ్రీగంగానగర్. ఈ నెల 3వ తేదీన రామ్సింగ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే ట్రాక్‌పై ఒక భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రెండు కాంక్రీట్ రైల్వే స్లీపర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఏ రైలూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. అది ఒక ఉగ్రవాద కుట్రగా భావించిన అధికారులు, పంజాబ్ పోలీసులతో కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన మహక్దీప్ కౌర్ అనే యువతిని, దేవేందర్ సింగ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరు పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రెండు విదేశీ ఆటోమేటిక్ పిస్టళ్లు, 46 లైవ్ బుల్లెట్స్, 30 వేల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక యువతి, ఒక సాధారణ యువకుడు ఇలా దేశద్రోహులుగా ఎందుకు మారారన్నదే ఇప్పుడు ఇంటిలిజెన్స్ వర్గాలను కలవరపెడుతున్న అంశంగా మారింది.



