ప్రపంచాన్ని వణికిస్తున్న కిమ్…AI డ్రోన్లతో నార్త్ కొరియా విధ్వంసం!

నార్త్ కొరియా సైనిక బలగాలకు మిస్సైల్ టెస్టులు కొత్త కాదు. కానీ ఈసారి కిమ్ చేసిన ప్రదర్శన పూర్తిగా భిన్నమైనది. కేవలం అణ్వాయుధాలపైనే ఆధారపడకుండా, సాంప్రదాయ ఆయుధాలు, స్మార్ట్ టెక్నాలజీ వైపు నార్త్ కొరియా అడుగులు వేస్తోంది. ఈ ప్రదర్శనలో 600 మిల్లీమీటర్ల భారీ క్యాలిబర్ కలిగిన స్నైపర్ మల్టిపుల్ రాకెట్ లాంచర్లను వారు పరీక్షించారు. 600 మిల్లీమీటర్ల అంటే ఇవి దాదాపు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులతో సమానమైన విధ్వంసాన్ని సృష్టించగలవు. ఈ రాకెట్ లాంచర్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని, ఈ డ్రిల్ లో ఒకేసారి పది కంటే ఎక్కువ లాంచర్లతో కాల్పులు జరిపినట్లు ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు AI టెక్నాలజీతో పనిచేసే అత్యాధునిక ఆత్మాహుతి డ్రోన్లను కూడా వారు ప్రదర్శించారు. సైనికుల అవసరం లేకుండా, రాడార్లకు కూడా చిక్కకుండా శత్రువుల ట్యాంకులు, బంకర్లను నేరుగా ఢీకొట్టి పేలిపోయే ఈ డ్రోన్ల ద్వారా క్షిపణులను ప్రయోగించి కిమ్ తన శత్రువులకు స్పష్టమైన సంకేతాలు పంపారు.
ఈ ఆయుధాల ప్రదర్శన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ చేసిన ప్రసంగం అంతర్జాతీయ నిపుణులను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. మారుతున్న ఆధునిక యుద్ధ పరిస్థితుల్లో ఉత్తర కొరియా సైన్యం డ్రోన్ల యుద్ధం లో సంపూర్ణ ఆధిపత్యం సాధించాలని ఆయన సైనికులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవాలంటే మనకు అపారమైన సైనిక బలం అవసరం. బలహీనులను ఎవరూ పట్టించుకోరు. మనం ఒక శక్తిమంతమైన దేశంగా ఉంటేనే మన దేశంలో శాంతిని కాపాడుకోగలం అని కిమ్ స్పష్టం చేశారు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఖరీదైన యుద్ధ ట్యాంకులు, క్షిపణులను ఎదుర్కోవడానికి రెండు దేశాలు అత్యంత చవకైన డ్రోన్లను ఏ స్థాయిలో వాడుతున్నాయో కిమ్ నిశితంగా గమనిస్తున్నారు. ఆ ఘర్షణల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, సాంకేతికంగా బలమైన సౌత్ కొరియా, అమెరికా సైన్యాలను ఎదుర్కోవాలంటే కేవలం అణ్వాయుధాలు సరిపోవని, భవిష్యత్తు యుద్ధాలన్నీ AI డ్రోన్లతోనే జరుగుతాయని గ్రహించి ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాలను ఆ దిశగా వేగంగా పెంచుకుంటోంది.



