400 యుద్ధ నౌకలతో దండయాత్ర..శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు!

సముద్రాలపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనాలు భయంకరమైన ఎత్తుగడలు వేస్తున్నాయి. ఒకప్పుడు నామమాత్రంగా ఉన్న చైనా నావికాదళం , ఇప్పుడు అమెరికాకు పోటీగా ఎదిగింది. కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే వందల సంఖ్యలో అత్యాధునిక యుద్ధనౌకలు , అణు జలాంతర్గాములను సిద్ధం చేసి ప్రపంచంలోనే అతిపెద్ద నావికా శక్తిగా అవతరించింది. తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుతం చైనా దగ్గర ఏకంగా 400కు పైగా భారీ యుద్ధ నౌకలున్నాయి. నౌకల సంఖ్యలో ఇది ఇప్పటికే అమెరికాను దాటేసింది. కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాకుండా, దక్షిణ చైనా సముద్రం , తైవాన్, జపాన్.. చివరకు మన హిందూ మహాసముద్రం వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది. చైనా నౌకాదళ విస్తరణ అనేది ఆధునిక చరిత్రలోనే ఒక అతిపెద్ద సైనిక పరిణామంగా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అభివర్ణిస్తున్నారు. 2013లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత షీ జిన్‌పింగ్ ఒక సముద్ర మహాశక్తి గా ఎదిగే విధంగా ముందుకు నడిపించారు. ప్రస్తుతం చైనా వద్ద మూడు పూర్తిస్థాయి విమాన వాహక నౌకలు ఉన్నాయి. నాలుగో విమాన వాహక నౌకను అణుశక్తితో పనిచేసేలా అత్యంత సీక్రెట్‌గా నిర్మిస్తోంది. 2020 నుంచి ఇప్పటివరకు చైనా తన అమ్ములపొదిలో 71 భారీ యుద్ధనౌకలను చేర్చుకుంటే.. అందులో కేవలం గత ఏడాదిలోనే 19 నౌకలను లాంచ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. సంఖ్య పరంగా అమెరికా కన్నా చైనా ముందున్నప్పటికీ.. నౌకల పరిమాణం, బరువు , ఫైర్ పవర్ విషయంలో అమెరికా ఇప్పటికీ కొంచెం ఆధిక్యంలోనే ఉంది. కానీ, రాబోయే ఐదేళ్లలో ఆ గ్యాప్‌ను కూడా పూడ్చడానికి చైనా శరవేగంగా అడుగులు వేస్తోంది.
చైనా షిప్‌యార్డ్ ఇండస్ట్రీ సత్తా మాములుగా లేదు. ఈరోజు ప్రపంచంలో తిరుగుతున్న వాణిజ్య నౌకల్లో , కంటైనర్ నౌకల్లో సగానికి పైగా చైనాలోనే తయారవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ షిప్ బిల్డర్‌గా ఉన్న చైనా.. ఇప్పుడు అదే టెక్నాలజీని, అదే మ్యాన్‌పవర్‌ను యుద్ధనౌకల తయారీకి వాడుకుంటోంది. ముఖ్యంగా షాంఘై సమీపంలోని చాంగ్షింగ్ ద్వీపం ఈ నౌకాదళ విస్తరణకు ప్రధాన కేంద్రంగా మారింది. ఐదేళ్ల క్రితం ఖాళీ స్థలంగా ఉన్న ఆ దీవిని చూసి పాశ్చాత్య దేశాలు లైట్ తీసుకున్నాయి. కానీ ఇప్పుడు తీరా ఉపగ్రహ చిత్రాలు చూస్తే.. అక్కడ ఏకంగా 40 వేల టన్నుల బరువున్న డ్రోన్ క్యారియర్ సిచువాన్ లాంటి అతిభారీ ఉభయచర దాడి నౌకలు రూపుదిద్దుకుంటున్నాయి. అదే షిప్‌యార్డ్‌లో డీజిల్ సబ్మెరైన్ల స్థానంలో.. అత్యంత నిశ్శబ్దంగా నీటి అడుగున నెలల తరబడి ప్రయాణించే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్లు తయారవుతున్నాయి. చైనా నౌకాదళ విస్తరణ వెనుక ఒక ఆక్రమణ వ్యూహం ఉంది. యెల్లో సీ నుంచి తూర్పు, దక్షిణ చైనా సముద్రాల వరకు ప్రతిరోజూ సుమారు 100కు పైగా చైనా యుద్ధనౌకలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ముఖ్యంగా తైవాన్ చుట్టుపక్కల అయితే ఏ సమయంలో చూసినా కనీసం ఆరు భారీ యుద్ధ నౌకలు కాపలా ఉంటున్నాయి. అమెరికా రక్షణ వ్యూహంలో జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్ లాంటి మిత్రదేశాలన్నీ కలిపి ఫస్ట్ ఐలాండ్ చైన్ గా పిలుస్తారు. రేపు ఏదైనా యుద్ధం వస్తే అమెరికా సైన్యం ఈ చైన్ మీదుగానే సముద్రంలోకి ఎంటర్ కావాలి. ఇప్పుడీ ఫస్ట్ ఐలాండ్ చైన్‌ను ఛేదించడమే చైనా అసలు లక్ష్యం. దక్షిణ చైనా సముద్రంలో ఇప్పటికే ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలను భయపెడుతూ ఆర్టిఫిషియల్ దీవులను నిర్మించింది. భవిష్యత్తులో తైవాన్‌పై దాడి చేయాల్సి వస్తే.. పసిఫిక్ మహాసముద్రం నుంచి అమెరికా సైన్యం రక్షణకు రాకుండా అడ్డుకోవడానికే చైనా ఈ సముద్ర ప్రాకారాన్ని నిర్మిస్తోందని రక్షణా రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.



