రష్యా -ఉక్రెయిన్ యుద్ధం..జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్ కాల్

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గత ఐదేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధం ఇది. ఈ యుద్ధం వల్ల కేవలం ఆ రెండు దేశాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, ఆహార భద్రత తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. అమెరికా, యూరప్ దేశాలు ఎన్ని ఆంక్షలు విధించినా ఈ యుద్ధం ఆగడం లేదు. అయితే ఇప్పుడు ఈ భీకర యుద్ధానికి ముగింపు పలికే సత్తా, ఇద్దరు దేశాధినేతలను ఒకే టేబుల్ మీద కూర్చోబెట్టి మాట్లాడించగలిగే సత్తా కేవలం ఒక్క భారతదేశానికే, ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి మాత్రమే ఉందని యావత్ ప్రపంచం నమ్ముతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడటం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్ లో పెను సంచలనంగా మారింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడిన వెంటనే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ సంభాషణ అత్యంత ఫలవంతంగా జరిగిందని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, యుద్ధం వల్ల తలెత్తుతున్న మానవతా సంక్షోభం గురించి జెలెన్స్కీ తన అభిప్రాయాలను ప్రధానితో పంచుకున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ఈ యుద్ధానికి సైనికపరమైన పరిష్కారం లేదని తేల్చి చెప్పారు. కేవలం దౌత్యం , శాంతియుత చర్చల ద్వారా మాత్రమే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పేందుకు భారత్ తన వంతుగా ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. కేవలం యుద్ధం గురించే కాకుండా, రాబోయే రోజుల్లో భారత్, ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ యుద్ధం ఎంత ఘోరంగా మారుతోందో చూస్తున్న ప్రపంచం, ఇప్పుడు గౌరవప్రదమైన శాంతి కోసం భారతదేశం చేసే సహాయం కోసం ఎదురుచూస్తోందని సాక్షాత్తూ జెలెన్స్కీ పేర్కొనడం భారత్ దౌత్యపరమైన విజయానికి నిదర్శనం. ఈ సంభాషణ తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సివిలియన్ షిప్పింగ్ , ధాన్యం ఎగుమతులు, ఇంధన భద్రత వంటి ముఖ్యమైన విషయాల్లో భారత్ తన వంతు కృషి చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఆహార భద్రత కోసం బ్లాక్ సీ మీదుగా ఒక సేఫ్ కారిడార్‌ను ఏర్పాటు చేసే విషయంలో భారత్ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని మోదీ జెలెన్స్కీకి తెలియజేశారు. ఈ చొరవను ఉక్రెయిన్ ఎంతగానో స్వాగతిస్తోంది. ఒకవైపు రష్యాతో స్నేహం కొనసాగిస్తూనే, మరోవైపు ఉక్రెయిన్ కు అండగా నిలబడుతూ, గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా భారత్ నిలబడుతోంది. ఈ ఫోన్ కాల్ జరగడానికి కొన్ని రోజుల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం గుర్తుచేసుకోవాలి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో ప్రధాని మోదీ దగ్గర చాలా మంచి ఐడియాలు ఉన్నాయని పుతిన్ స్వయంగా చెప్పారు. తమ మధ్య ఎంత స్నేహపూర్వక సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రతి మీటింగ్ లోనూ మోదీ కచ్చితంగా ఉక్రెయిన్ యుద్ధం గురించి, దాన్ని ఎలా ముగించాలి అనే దాని గురించి నిలదీస్తుంటారని పుతిన్ తెలిపారు.దీన్ని బట్టి చూస్తే.. మోదీ కేవలం ఉక్రెయిన్ తోనే కాదు, రష్యాతో కూడా తెరవెనుక తీవ్రమైన దౌత్యపరమైన మంతనాలు జరుపుతున్నారని స్పష్టమవుతోంది. ఇరు దేశాలను ఒక కామన్ పాయింట్ దగ్గరకు తీసుకువచ్చి, శాంతి ఒప్పందం కుదిర్చే దిశగా భారతదేశం పావులు కదుపుతోంది. ఇప్పుడు మోదీ, జెలెన్స్కీ మధ్య జరిగిన ఈ ఫోన్ కాల్ రాబోయే రోజుల్లో ఒక కీలకమైన శాంతి ఒప్పందానికి పునాది వేస్తుందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.



