నవంబర్ 24న కార్తీక పౌర్ణమి.. ఆకాశంలో అద్భుత దృశ్యం అరుదైన అద్భుతం

ఈ నవంబర్ 24వ తేదీ ఒక అత్యంత ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. అదే బీవర్ మూన్. ఈ ఏడాది చివర్లో వరుసగా ఏర్పడనున్న మూడు సూపర్ మూన్లలో ఇదే మొట్టమొదటిది. విశేషం. ఏమిటంటే ఈ బీవర్ మూన్ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమితో కలిసి వస్తోంది. సాధారణంగా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి చంద్రుడికి పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఉత్తర అమెరికా సంప్రదాయాల్లో ప్రకృతి మార్పులను బట్టి ఒక్కో ప్రత్యేకమైన పేరు పెడుతుంటారు. అలా నవంబర్ నెలలో వచ్చే పౌర్ణమి నాటి చంద్రుడిని బీవర్ మూన్ అని పిలుస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన ప్రకృతి కారణం ఉంది. బీవర్లు అనేవి ఎలుక జాతికి చెందిన ప్రత్యేకమైన జీవులు. ఉత్తర అమెరికాలో నవంబర్ నెల నాటికి చలికాలం తీవ్రత పెరుగుతుంది. ఆ కఠినమైన శీతాకాలాన్ని తట్టుకునేందుకు బీవర్లు ఈ సమయంలోనే తమకు కావాల్సిన ఆహారాన్ని భారీగా నిల్వ చేసుకుంటాయి. నదులు, వాగుల వద్ద కలపతో తమ గూళ్లను, ఆనకట్టలను పటిష్టంగా నిర్మించుకుని, గడ్డకట్టే చలి నుంచి రక్షణ పొందేందుకు వాటిలోకి చేరుతాయి. సరిగ్గా బీవర్లు తమ శీతాకాలపు ఏర్పాట్లను పూర్తి చేసుకునే సమయంలో ఈ పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో కనిపిస్తాడు కాబట్టే, దీనికి బీవర్ మూన్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈసారి వస్తున్న బీవర్ మూన్ కు మరో ప్రత్యేకత కూడా తోడైంది. ఇది సాధారణ పౌర్ణమి చంద్రుడు కాదు, ఒక సూపర్ మూన్. ఈ ఏడాది చివర్లో వరుసగా ఏర్పడబోతున్న మూడు సూపర్ మూన్లలో నవంబర్ 24న వచ్చే ఈ బీవర్ మూన్ మొదటిది. సాధారణంగా చంద్రుడు తన దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు పౌర్ణమి సంభవిస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. ఆ సమయంలో చంద్రుడు సాధారణం కంటే కాస్త పెద్దగా, మరింత ప్రకాశవంతంగా ఆకాశంలో కనిపిస్తాడు. .ప్రముఖ రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్విచ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 24న ఉదయం 9 గంటల 53 నిమిషాలకు పౌర్ణమి తన గరిష్ఠ దశకు చేరుకుంటుంది. అయితే మనకు నవంబర్ 23 , 24 తేదీల్లో రెండు రోజుల పాటు చంద్రుడు దాదాపు సంపూర్ణంగా, కనువిందు చేసేలా కనిపించనున్నాడు. రాత్రి వేళ ఆకాశం నిర్మలంగా ఉంటే ఎలాంటి టెలిస్కోప్ అవసరం లేకుండానే నేరుగా కళ్లతో ఈ అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు.
మన భారతీయ సంస్కృతిలో ఈ రోజుకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. హిందువులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే కార్తీక పౌర్ణమి ఈ బీవర్ మూన్తో కలిసి రావడం విశేషం. హిందూ పంచాంగం ప్రకారం.. కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 23వ తేదీ రాత్రి 11 గంటల 42 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ పవిత్ర తిథి నవంబర్ 24వ తేదీ రాత్రి 8 గంటల 23 నిమిషాలకు ముగుస్తుంది. కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. తెల్లవారుజామునే పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించడం, శివకేశవులకు ప్రత్యేక పూజలు చేయడం, శక్తి కొలదీ దానధర్మాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాయంత్రం వేళ ఆలయాల్లో, ఇళ్ల ముందు, నదీ తీరాల్లో భక్తులు వేలాదిగా దీపారాధనలు చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమినే దేవతలు దీపావళి జరుపుకునే రోజుగా భావిస్తూ దేవదీపావళి గా కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నవంబర్ 24న ఆకాశంలో కనిపించబోయే ఈ దృశ్యం సైన్స్‌కు, మన సంప్రదాయానికి మధ్య ఉన్న అద్భుతమైన అనుబంధాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ఖగోళ శాస్త్రం ప్రకారం భూమికి దగ్గరగా వచ్చే సూపర్ మూన్ రాత్రి ఆకాశాన్ని వెన్నెలతో నింపేస్తుంటే, భూమిపై భక్తులు వెలిగించే కార్తీక దీపాలు, దేవదీపావళి కాంతులు ఆ వెన్నెలకు మరింత శోభను చేకూరుస్తాయి. ముఖ్యంగా నవంబర్ 23 రాత్రి 11:42 నుంచే పౌర్ణమి తిథి మొదలై, నవంబర్ 24 రాత్రి 8:23 వరకు ఉండటంతో.. రెండు రోజుల పాటు సాయంత్రం వేళల్లో ఆకాశంలో నిండు చంద్రుడిని చూసే అవకాశం లభిస్తుంది.



