గోల్డ్, సిల్వర్ కాదు.. ఒక్క నెలలోనే భారీగా పతనమైన రాగి ధరలు..!

గత ఎనిమిది నెలలుగా బంగారం, వెండి మార్కెట్లలో భారీ ఎత్తుపల్లాలు కనిపిస్తున్నాయి. గతంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకినప్పుడు పెట్టుబడిదారులంతా రాగి వైపు చూశారు. కానీ ఇప్పుడు ఆ ఎర్ర బంగారం ధరలు కూడా నేలచూపులు చూస్తున్నాయి. కేవలం ఒక్క నెలలోనే దేశీయ మార్కెట్లో రాగి ధరలు ఏకంగా 15 శాతం మేర కుప్పకూలాయి. గ్లోబల్ మార్కెట్లో ఏడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే ఈ పతనం ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చినా.. సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం పెద్ద ఊరటనిచ్చే శుభవార్తగా మారబోతోంది. ఇప్పుడు అన్ని రకాల లోహాల ధరలు క్రమక్రమంగా దిగొస్తున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా భావించే రాగి ధరలు గ్లోబల్ మార్కెట్లలో ఏకంగా ఏడు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే ఈ పతనం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో గత నెల రోజుల వ్యవధిలోనే రాగి ధరలు 13 శాతం మేర పడిపోయాయి. ఇక లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ అంటే ఎల్ఎంఈ విషయానికొస్తే.. మూడు నెలల రాగి ఫ్యూచర్స్ ఒక్కరోజులోనే ఏకంగా 4.6 శాతం తగ్గి 12 వేల 471 డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధరలు క్రాష్ అవుతుండటంతో, దేశీయ మార్కెట్లోనూ అదే బాటలో పయనిస్తున్నాయి. భారత్‌లో గత నెల రోజుల్లో రాగి ధరలు ఏకంగా 15 శాతం మేర పడిపోయాయి. భారతదేశ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ అంటే ఎంసీఎక్స్‌లో కాపర్ ధరలు సుమారు 15 శాతం తగ్గగా, గురువారం మరో 1 శాతం తగ్గి కిలోకు 1,192 వద్ద ముగిశాయి.
సాధారణంగా విద్యుత్, నిర్మాణ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో నిత్యం భారీ డిమాండ్ ఉండే రాగి ధరలు ఒక్కసారిగా ఇలా 15 శాతం మేర పడిపోవడం వెనుక రెండు ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో మొదటిది అమెరికా డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయ మార్కెట్లో లోహాల వ్యాపారమంతా ప్రధానంగా డాలర్లలోనే జరుగుతుంది. ఎప్పుడైతే అమెరికా డాలర్ బలపడుతుందో, అప్పుడు ఇతర దేశాల కొనుగోలుదారులకు తమ స్థానిక కరెన్సీలో ఈ లోహాలు మరింత ఖరీదుగా మారుతాయి. దీంతో సహజంగానే అంతర్జాతీయ కొనుగోళ్లు మందగించి, ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇక రెండో ప్రధాన కారణం చైనా ప్రపంచంలోనే అత్యధిక రాగిని వినియోగించే దేశం. కానీ ఇటీవల కాలంలో చైనా నుంచి రాగికి డిమాండ్ గణనీయంగా తగ్గిపోయింది. అతిపెద్ద కొనుగోలుదారు అయిన చైనా వెనక్కి తగ్గడంతో గ్లోబల్ మార్కెట్లో సరఫరా పెరిగి, రాగి ధరలు ఏడు నెలల కనిష్టానికి జారిపోయాయి.



