అమెరికాలో హైఅలర్ట్.. ఎయిర్‌పోర్టులకు హెచ్చరిక!

అమెరికాలో మరోసారి భద్రతా సంస్థలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఈసారి ఉగ్రవాదుల కన్ను నేరుగా విమానయాన రంగంపై పడిందన్న నిఘా సమాచారం అమెరికాను అలెర్ట్ చేసింది. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థల నుంచి విమానాలకు, విమానాశ్రయాలకు, అలాగే ఎయిర్ కార్గో కార్యకలాపాలకు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి. విమానాలు, విమానాశ్రయాలపై దాడులు చేయాలంటూ ఉగ్రవాద అనుకూల వర్గాలు ఆన్లైన్ వేదికగా సందేశాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు, విమానాశ్రయ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, రవాణా భద్రతా సంస్థ సంయుక్తంగా కీలక హెచ్చరిక జారీ చేశాయి. అది కూడా అమెరికాలో అత్యంత రద్దీగా ఉండే థాంక్స్ గివింగ్ సెలవుల వేళ ఈ హెచ్చరిక రావడం కలకలం రేపుతోంది.
అమెరికా భద్రతా సంస్థలు అకస్మాత్తుగా ఇంత పెద్ద స్థాయిలో హెచ్చరిక జారీ చేయడానికి బలమైన కారణం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఒక సంచలన ఘటనను అల్‌ఖైదా అనుబంధ వర్గాలు తమ ప్రచారానికి ఆయుధంగా వాడుకుంటున్నాయి. సెప్టెంబర్ నెలలో దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నగరానికి వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో హైజాక్ యత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఆ విమానంలో సాక్షాత్తూ కోపైలట్ తనతో ఉన్న మరో పైలట్‌పై దాడికి పాల్పడటం అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడు సరిగ్గా ఆ ఫ్లైదుబాయ్ హైజాక్ యత్నాన్ని అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద వర్గాలు ప్రశంసిస్తూ సందేశాలు విడుదల చేస్తున్నాయి.
కేవలం ప్రశంసించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి దాడులను మళ్లీ మళ్లీ నిర్వహించాలని తమ మద్దతుదారులను ప్రోత్సహిస్తున్నట్లు అమెరికా నిఘా సంస్థలు గుర్తించాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాలతో పాటు యూదుల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలని ఆ ఉగ్ర సందేశాల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. కేవలం ప్రయాణికుల విమానాలనే కాకుండా, సరుకు రవాణా చేసే ఎయిర్ కార్గో కార్యకలాపాలను, విమానాశ్రయ ప్రాంగణాలను కూడా లక్ష్యంగా చేసుకోవాలన్న ఆ ప్రచారం భద్రతా వర్గాలకు పెద్ద సవాలుగా మారింది.



