ఆ సమయంలో పెద్ద శబ్దాలు వచ్చే టపాసులతో ఎందుకు ఇబ్బంది పెడతారు…రేణు దేశాయ్ ఫైర్..!

దీపావళి అంటే దీపాల పండుగ, వెలుగుల పండుగ, అయితే పండుగ ముగిసిపోయి రెండు మూడు రోజులైనా సరే.. ఇంకా రాత్రి 11 గంటలకు, 12 గంటలకు భారీ శబ్దాలతో బాంబులు కాలుస్తుంటే ఏమనుకోవాలి? దీన్ని పండుగ అంటారా, లేక పక్కవాళ్లను ఇబ్బంది పెట్టే పైశాచిక ఆనందం అంటారా? ఇదే ప్రశ్నను ఇప్పుడు సూటిగా అడుగుతున్నారు నటి, దర్శకురాలు రేణు దేశాయ్ . సామాజిక అంశాలపై ఎప్పుడూ నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా స్పందించే రేణు దేశాయ్.. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన ఒక సుదీర్ఘ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎప్పుడూ సమాజంలో జరిగే విషయాలపై ఆమె తన గళాన్ని వినిపిస్తూనే ఉంటారు. ఈ దీపావళికి కూడా ఆమె తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆమె తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు.. రాత్రి 11 గంటలవుతోంది.. అయినా ప్రజలు ఇంకా పెద్ద శబ్దాలు వచ్చే టపాసులు కాలుస్తూనే ఉన్నారు. నిజానికి దీపావళి రోజున నేను ఈ విషయంపై ఏమైనా మాట్లాడి ఉంటే.. నన్ను వెంటనే హిందూ వ్యతిరేకి అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు, ఓ ముద్ర వేసేవారు. అందుకే నేను పండుగ రోజు మౌనంగా ఉండిపోయాను. కానీ పండుగ అయిపోయిన తర్వాత కూడా రాత్రి 11 గంటలకు ఇంత పెద్ద శబ్దాలతో టపాసులు కాల్చడానికి ఇప్పుడు ఏ పండుగ ఉందో నాకు అర్థం కావడం లేదు అని ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
మన ఆనందం పక్కవాడికి శాపం కాకూడదు కదా. ప్రతి ఒక్కరూ కేవలం తమ ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తూ.. ఇష్టానుసారంగా ప్రవర్తించడం కేవలం మూర్ఖత్వమే అని ఆమె మండిపడ్డారు. అర్ధరాత్రి ఆసుపత్రుల్లో ఉన్న రోగులు, ఇళ్లలో ఉన్న వృద్ధులు, పసిపిల్లలు ఆ భారీ శబ్దాలకు ఎంతలా భయపడతారో, ఎంతలా ఉలిక్కిపడతారో ఎవరూ ఆలోచించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ బాంబుల మోతకు మూగజీవాలు గజగజ వణికిపోతున్నాయి. ఇతరుల బాధలను అర్థం చేసుకోలేకపోవడం, కనీస మానవత్వం చూపించకపోవడం ఏ రకమైన సంబరం అని రేణు ప్రశ్నించారు. దీపావళి అనేది దీపాల పండుగ, వెలుగుల పండుగ.. అంతే తప్ప దానిని శబ్దాల పోటీగా మార్చకూడదు. పండుగను సంతోషంగా జరుపుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ ఆ వేడుకల కారణంగా పక్కవారికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని ఆమె హితవు పలికారు. సాధారణంగా టపాసుల గురించి ఎవరైనా మాట్లాడితే.. ఫ్యాక్టరీల వల్ల, కార్ల వల్ల రోజూ పొల్యూషన్ వస్తోంది కదా, అప్పుడు మాట్లాడరేం? అని ఎదురు ప్రశ్నిస్తారు. రేణు దేశాయ్ తన పోస్ట్‌లో దీనికి కూడా కౌంటర్ ఇచ్చారు. నేను ఇక్కడ వాయు కాలుష్యం గురించి మాట్లాడటం లేదు. ఏడాదిలోని 364 రోజుల పాటు వాహనాలు, పరిశ్రమల కారణంగా ఎలాగూ కాలుష్యం ఉంటోంది, దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడి ప్రయోజనం లేదని నాకు తెలుసు. కానీ నేను అడుగుతోంది శబ్ద కాలుష్యం గురించి. పక్కవాళ్ల నిద్రను చెడగొట్టడం గురించి అని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. టపాసులు కాల్చడంపై సమయపాలన పాటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కనీసం రాత్రి 10 గంటలలోపే టపాసులు కాల్చడం పూర్తి చేయాలని, ఆ తర్వాత ప్రజలను ప్రశాంతంగా నిద్రపోనివ్వాలని ఆమె కోరారు.



