నవంబర్ 24న కార్తీక పౌర్ణమి.. ఆకాశంలో అద్భుత దృశ్యం అరుదైన అద్భుతం

ఈ నవంబర్ 24వ తేదీ ఒక అత్యంత ప్రత్యేకమైన రోజుగా నిలవబోతోంది. ఆకాశంలో ఒక అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. అదే బీవర్ మూన్. ఈ ఏడాది చివర్లో వరుసగా ఏర్పడనున్న మూడు సూపర్ మూన్లలో ఇదే మొట్టమొదటిది. విశేషం. ఏమిటంటే ఈ బీవర్ మూన్ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమితో కలిసి వస్తోంది. సాధారణంగా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి చంద్రుడికి పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా ఉత్తర అమెరికా సంప్రదాయాల్లో ప్రకృతి మార్పులను బట్టి ఒక్కో ప్రత్యేకమైన పేరు పెడుతుంటారు. అలా నవంబర్ నెలలో వచ్చే పౌర్ణమి నాటి చంద్రుడిని బీవర్ మూన్ అని పిలుస్తారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన ప్రకృతి కారణం ఉంది. బీవర్లు అనేవి ఎలుక జాతికి చెందిన ప్రత్యేకమైన జీవులు. ఉత్తర అమెరికాలో నవంబర్ నెల నాటికి చలికాలం తీవ్రత పెరుగుతుంది. ఆ కఠినమైన శీతాకాలాన్ని తట్టుకునేందుకు బీవర్లు ఈ సమయంలోనే తమకు కావాల్సిన ఆహారాన్ని భారీగా నిల్వ చేసుకుంటాయి. నదులు, వాగుల వద్ద కలపతో తమ గూళ్లను, ఆనకట్టలను పటిష్టంగా నిర్మించుకుని, గడ్డకట్టే చలి నుంచి రక్షణ పొందేందుకు వాటిలోకి చేరుతాయి. సరిగ్గా బీవర్లు తమ శీతాకాలపు ఏర్పాట్లను పూర్తి చేసుకునే సమయంలో ఈ పౌర్ణమి చంద్రుడు ఆకాశంలో కనిపిస్తాడు కాబట్టే, దీనికి బీవర్ మూన్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈసారి వస్తున్న బీవర్ మూన్ కు మరో ప్రత్యేకత కూడా తోడైంది. ఇది సాధారణ పౌర్ణమి చంద్రుడు కాదు, ఒక సూపర్ మూన్. ఈ ఏడాది చివర్లో వరుసగా ఏర్పడబోతున్న మూడు సూపర్ మూన్లలో నవంబర్ 24న వచ్చే ఈ బీవర్ మూన్ మొదటిది. సాధారణంగా చంద్రుడు తన దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు పౌర్ణమి సంభవిస్తే దాన్ని సూపర్ మూన్ అంటారు. ఆ సమయంలో చంద్రుడు సాధారణం కంటే కాస్త పెద్దగా, మరింత ప్రకాశవంతంగా ఆకాశంలో కనిపిస్తాడు. .ప్రముఖ రాయల్ మ్యూజియమ్స్ గ్రీన్విచ్ వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 24న ఉదయం 9 గంటల 53 నిమిషాలకు పౌర్ణమి తన గరిష్ఠ దశకు చేరుకుంటుంది. అయితే మనకు నవంబర్ 23 , 24 తేదీల్లో రెండు రోజుల పాటు చంద్రుడు దాదాపు సంపూర్ణంగా, కనువిందు చేసేలా కనిపించనున్నాడు. రాత్రి వేళ ఆకాశం నిర్మలంగా ఉంటే ఎలాంటి టెలిస్కోప్ అవసరం లేకుండానే నేరుగా కళ్లతో ఈ అద్భుత దృశ్యాన్ని చూడవచ్చు.



