బంగ్లాదేశ్ లో మళ్లీ హింస..అసలేం జరుగుతోంది?

బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజురోజుకూ మారుతున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా అయోమయ పరిస్థితి తలెత్తుతోందని అక్కడి మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే బీఎన్పీ కార్యకర్తలకు, అవామీ లీగ్ మద్దతుదారులకు మధ్య పలుచోట్ల తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దాడులు, ఇళ్ల ధ్వంసం వంటి ఘటనలు కలకలం రేపుతుంటే.. మరోవైపు ప్రస్తుత పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జమాతే ఇస్లామీ ఏకంగా 40 రోజుల పాటు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం పరిస్థితిని మరింత వేడెక్కించింది. ఇటు అవామీ లీగ్ నేతలు తమపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, అటు జమాతే ఇస్లామీ నేతలు మాత్రం షేక్ హసీనా రాక నేపథ్యంలో అవామీ లీగ్ కార్యకర్తలే హింసకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఢాకా నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ముఖ్యంగా నారైల్ జిల్లాలోని కాలియా ఉపజిల్లాలో ఉద్రిక్తత పరాకాష్టకు చేరింది. అక్కడ నిషిద్ధ అవామీ లీగ్ నేతలు, కార్యకర్తలకు చెందిన పలు ఇళ్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతేకాదు, పలు ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనల వెనుక గత బుధవారం జరిగిన పరిణామాల ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే నారైల్ కాలియా ప్రాంతంలో గత బుధవారం అధికార బీఎన్పీకి చెందిన ఇద్దరు నేతలు హత్యకు గురయ్యారు. ఆ ఘటన తర్వాత ప్రాంతీయంగా పెరిగిన ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రతీకార దాడులు, ఇళ్ల దహనానికి దారితీసినట్లు వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు బేరా ఉపజిల్లాలోనూ పరిస్థితి అదుపు తప్పింది. అక్కడ అధికార బీఎన్పీ, నిషిద్ధ అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.



