ఇజ్రాయెల్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెతన్యాహు పెట్టిన 4 షరతులు ఇవే!

గత నెల అక్టోబర్ 27న ఇజ్రాయెల్ లో జరిగిన ఎన్నికల్లో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇప్పుడు ఒక అనూహ్య అడుగు పడింది. ఇజ్రాయెల్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అందుకున్న సెంట్రిస్ట్ యషార్ పార్టీ అధినేత, మాజీ సైనిక చీఫ్ గాడీ ఐసెన్‌కోట్.. తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థి, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీని సుదీర్ఘ సంకీర్ణ చర్చలకు ఆహ్వానించారు. డిసెంబర్ 6వ తేదీతో ఐసెన్‌కోట్ గడువు ముగియనున్న నేపథ్యంలో, విస్తృత స్థాయి జాతీయ ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఈ ప్రయత్నం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, చర్చలకు ముందే నెతన్యాహు లికుడ్ పార్టీ నాలుగు కఠినమైన షరతులను తెరపైకి తీసుకురావడం చర్చనీయంశంగా మారింది.
మొత్తం 120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ అంటే నెసెట్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 61 సీట్ల మెజారిటీ అవసరం. కానీ, తాజా ఎన్నికల్లో ఏ ఒక్క రాజకీయ కూటమికీ ఆ 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో నవంబర్ 8న ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వివిధ పార్టీల అభిప్రాయాలను సేకరించారు. ఈ క్రమంలో గాడీ ఐసెన్కోట్కు 67 మంది చట్టసభ సభ్యులు మద్దతు ప్రకటించగా.. వారిలో 48 మంది ఆయన సొంత కూటమికి చెందినవారు, మరో 19 మంది అరబ్ పార్టీల సభ్యులు ఉన్నారు. మరోవైపు ప్రస్తుత ఆపద్ధర్మ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు 46 మంది సభ్యులు మద్దతు ఇవ్వగా, ఏడుగురు సభ్యులు ఎవరికీ మద్దతు తెలపలేదు. దీంతో అత్యధిక మంది సిఫార్సు చేసిన గాడీ ఐసెన్కోట్కు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బాధ్యతను అధ్యక్షుడు అప్పగించారు. ఇజ్రాయెల్ చట్టం ప్రకారం ఐసెన్కోట్కు లభించిన 28 రోజుల గడువు డిసెంబర్ 6న ముగుస్తుంది. అవసరమైతే అధ్యక్షుడు మరో 14 రోజుల పాటు ఈ గడువును పొడిగించే అవకాశం ఉంది.
కూటమిలోని ప్రధాన నేతలు మూడు వేర్వేరు మార్గాలను సూచిస్తున్నారు. మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ నెతన్యాహుతో దాదాపు మూడు గంటల పాటు భేటీ అవ్వడం పెద్ద కలకలం రేపింది. అధికారికంగా అది భద్రతా సమీక్ష అని చెప్పినా, రాజకీయ చర్చలు జరిగాయన్న ఊహాగానాలు చెలరేగాయి. అయితే బెన్నెట్ ఆ రూమర్లకు తెరదించారు. గాడీ ఐసెన్‌కోట్ నేతృత్వంలోని జాతీయ ఐక్య ప్రభుత్వానికే తన పూర్తి మద్దతు అని, నెతన్యాహు ప్రధానిగా ఉండే ఏ ప్రభుత్వంలోనూ తాను చేరబోనని బెన్నెట్ స్పష్టం చేశారు. అయితే, ఐసెన్‌కోట్ నాయకత్వంలో లికుడ్ పార్టీతో కలిసి ఐక్య ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బెన్నెట్ మొగ్గు చూపుతున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ బెయిటెను పార్టీ నేత అవిగ్డోర్ లిబర్‌మాన్ మాత్రం అరబ్ పార్టీలతో కలిసే లేదా వాటి మద్దతుపై ఆధారపడే ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీలైన షాస్, యునైటెడ్ తోరా జుడాయిజంలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరుతున్నారు. ఇక డెమోక్రాట్స్ నేత యాయిర్ గోలన్ మాత్రం.. అరబ్ మెజారిటీ పార్టీలైన రామ్', జాయింట్ లిస్ట్ బయటి మద్దతుతో మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. ఇలా కూటమిలో భిన్నాభిప్రాయాల మధ్య ఐసెన్‌కోట్ ఒకవైపు లికుడ్తో, మరోవైపు అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీలతో సమాంతరంగా చర్చలు జరుపుతున్నారు. విస్తృతమైన ఐక్య ప్రభుత్వం కోసం ఏ అవకాశాన్నీ వదిలిపెట్టబోమని, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటామని ఐసెన్‌కోట్ యషార్ పార్టీ ప్రకటించింది. నవంబర్ 15న లికుడ్తో జరిగిన తొలి రౌండ్ చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోయినా, ఇప్పుడు ఆదివారం నుంచి మరోసారి మారథాన్ చర్చలకు ఆహ్వానించింది.
అయితే, చర్చలకు సిద్ధమయ్యే ముందే నెతన్యాహు లికుడ్ పార్టీ తన షరతులను ప్రకటించింది. ముందుగా నెతన్యాహు, ఆయన ప్రభుత్వంపై సాగుతున్న రాజకీయ బహిష్కరణలు, వ్యక్తిగత దాడులను తక్షణమే ఆపాలని లికుడ్ డిమాండ్ చేసింది. జాతీయ ఐక్య ప్రభుత్వం కోసం లికుడ్ నాలుగు ప్రధాన సూత్రాలను ముందుంచింది. మొదటిది.. ఇజ్రాయెల్‌ను యూదు ప్రజల జాతీయ దేశంగా గుర్తిస్తూ ఉమ్మడి ప్రకటన చేయడం. రెండోది.. పాలస్తీనా దేశ ఏర్పాటును వ్యతిరేకించడం. మూడోది.. గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ భద్రతా మండలాలను కొనసాగించడం. నాలుగోది.. అల్ట్రా-ఆర్థడాక్స్ మత విద్యార్థులకు తప్పనిసరి సైనిక సేవ నుంచి మినహాయింపు విషయంలో విస్తృత ఒప్పందానికి రావడం. వీటికి తోడు ఉగ్రవాదానికి మద్దతిచ్చే పార్టీలతో సహకరించబోమని హామీ ఇవ్వాలని లికుడ్ షరతు పెట్టింది. ఇది నేరుగా అరబ్ పార్టీలైన రామ్, జాయింట్ లిస్ట్‌లను ఉద్దేశించి పెట్టిన షరతుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ షరతులు ఇరు పక్షాల మధ్య ఉన్న సైద్ధాంతిక అంతరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. 77 ఏళ్ల బెంజమిన్ నెతన్యాహు 2022 డిసెంబర్ నుంచి ఇజ్రాయెల్ ఫార్-రైట్ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. మరోవైపు అవినీతి, మోసం కేసుల్లో ఆయన దేశీయంగా విచారణను ఎదుర్కొంటున్నారు. 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి నేపథ్యంలో నెతన్యాహు మళ్లీ ప్రధాని పదవికి తిరిగి రాకూడదని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంలో తాను పనిచేయబోనని ఐసెన్‌కోట్ ఇప్పటికే పలుమార్లు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఈ చర్చలు ఏ మలుపు తిరుగుతాయన్నది కీలకంగా మారింది.



