అలాంటి ఒక్క తప్పుతో మూడో ప్రపంచ యుద్ధం?...బ్రిటన్ సంచలన హెచ్చరిక!

ప్రపంచ దేశాలను మరోసారి మూడో ప్రపంచ యుద్ధం భయం వెంటాడుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి, నిర్లక్ష్యపూరిత చర్యలు ఏ క్షణమైనా అనుకోకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని బ్రిటన్ రక్షణ నిఘా విభాగం అధిపతి సంచలన హెచ్చరిక జారీ చేశారు. బ్రిటన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ లెఫ్టినెంట్ జనరల్ మాథ్యూ జోన్స్ కేంబ్రిడ్జ్‌లో జరిగిన ఒక ఇంటెలిజెన్స్ సెమినార్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రష్యా ప్రస్తుతం నాటో దేశాలతో నేరుగా యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని, కానీ పుతిన్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉండటం వల్ల తీసుకుంటున్న దూకుడు నిర్ణయాలు, ఏదైనా ఒక తప్పుడు అంచనా పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో డెన్మార్క్‌లో ఉక్రేనియన్-అమెరికన్ పౌరుడిని హత్య చేసేందుకు రష్యా నిఘా విభాగం పన్నిన కుట్రను అడ్డుకోవడం, 2030 నాటికి బ్రిటన్ యుద్ధానికి సిద్ధం కావాలని ఆ దేశ రక్షణ మంత్రి హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను చాటిచెబుతోంది. రష్యా-నాటో దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, బ్రిటన్ నిఘా అధిపతి మాథ్యూ జోన్స్ చేసిన హెచ్చరిక ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది.
మాథ్యూ జోన్స్ ప్రసంగ వివరాలు అంతర్జాతీయ రక్షణ నిపుణులను ఉలిక్కిపడేలా చేశాయి. రష్యా-నాటో దేశాల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, బ్రిటన్ నిఘా అధిపతి మాథ్యూ జోన్స్ చేసిన హెచ్చరిక ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. రష్యా-నాటో సంబంధాలపై అత్యంత స్పష్టంగా మాట్లాడిన ఆయన.. రష్యా నాటోతో యుద్ధాన్ని కావాలని కోరుకోవడం లేదని నేను చెప్పగలను నా ప్రధాన ఆందోళన మాత్రం తీవ్రమైన పొరపాటు నిర్ణయం లేదా తప్పుడు అంచనా వల్ల తలెత్తే ప్రమాదమే. పుతిన్ ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నారు. ఆ పరిస్థితి ఇతర దేశాలను సవాలు చేసేలా మరింత దూకుడుగా వ్యవహరించడానికి దారితీస్తోంది అని మాథ్యూ జోన్స్ హెచ్చరించారు. అంతేకాదు, ఇటీవలి కాలంలో రష్యా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన ఘటనలు అనేకం ఉన్నాయని, వాటిలో ఏ ఒక్క ఘటనలోనైనా పరిస్థితులు కొద్దిగా భిన్నంగా మారి ఉండి ఉంటే, దాని పరిణామాలు ఊహించనంత తీవ్రంగా ఉండేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.



