షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం బ్రహ్మాస్త్రం.. నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

బంగ్లాదేశ్ ను 15 ఏళ్ల పాటు పాలించిన షేక్ హసీనా అక్కడ తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో 2024 ఆగష్టులో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దేశం విడిచి భారత్ కు పారిపోవాల్సి రావడం ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక అతిపెద్ద సంచలనం. అప్పటి నుంచి ఆమె భారత్ లో సురక్షితంగా తలదాచుకుంటున్నారు. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభుత్వం షేక్ హసీనాపై ఒక ఊహించని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. ఇప్పటికే డిసెంబర్ నెలలో మళ్లీ బంగ్లాదేశ్ లో అడుగుపెట్టి రాజకీయాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్న హసీనాకు.. ఆమె పెట్టుకున్న కొత్త పాస్పోర్ట్ అభ్యర్థనను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ కు పారిపోయి వచ్చినప్పుడు, ఆమె దగ్గర బంగ్లాదేశ్ ప్రభుత్వం జారీ చేసిన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంది. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రధాని పదవి పోయిన వెంటనే ఆ దౌత్య పాస్పోర్ట్ కు వ్యాలిడిటీ ఉండదు. అయితే భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న పాత ఒప్పందాల ప్రకారం 45 రోజుల పాటు వీసా లేకుండా ఇండియాలో ఉండే వెసులుబాటుతో ఆమె ఇక్కడ తలదాచుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసిపోయింది. ఆమెకు ఇప్పుడు అధికారికంగా ఒక గుర్తింపు కావాలి. వేరే దేశాలకు ఆశ్రయం కోసం వెళ్లాలన్నా, లేక తిరిగి బంగ్లాదేశ్ వెళ్లాలన్నా ఆమెకు సాధారణ బంగ్లాదేశ్ పాస్పోర్ట్ తప్పనిసరి. దీనికోసం ఆమె భారత్ లోని బంగ్లాదేశ్ ఎంబసీ ద్వారా కొత్త సాధారణ పాస్పోర్ట్ కోసం లాంఛనంగా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ దరఖాస్తును చూసిన బంగ్లాదేశ్ హోంశాఖ, ఇమ్మిగ్రేషన్ అధికారులు దాన్ని నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారు.
ఒక దేశ పౌరురాలిగా ఆమెకు పాస్పోర్ట్ పొందే ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ, ఆమెపై బంగ్లాదేశ్ లో వందలాది మర్డర్ కేసులు, మానవ హక్కుల ఉల్లంఘన కేసులు ఉన్నాయని.. ఒక క్రిమినల్ విచారణ ఎదుర్కొంటున్న, దేశం విడిచి పారిపోయిన వ్యక్తికి పాస్పోర్ట్ జారీ చేసే ప్రసక్తే లేదని బంగ్లా ప్రభుత్వం తేల్చిచెప్పింది. పాస్పోర్ట్ లేకపోతే ఆమె అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం చట్టపరంగా దాదాపు అసాధ్యం. ఆమె ఇప్పుడు ఏ దేశానికి వెళ్లలేని స్టేట్లెస్ పర్సన్ గా మారే ప్రమాదం ఏర్పడింది.



