హార్ముజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా ఎఫ్-16 జెట్‌పై మిస్సైల్ ఎటాక్?

అమెరికా, ఇరాన్ మధ్య మరో సంచలన సైనిక వివాదం తెరపైకి వచ్చింది. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి గగనతలంలో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానంపై తాము క్షిపణి దాడి చేశామని ఇరాన్ సైన్యం సంచలన ప్రకటన చేసింది. నవంబర్ 21 శనివారం నాడు ఇరాన్ సైన్యం , అక్కడి ప్రభుత్వ మీడియా ఒక సంచలన వార్తను బయటపెట్టాయి. నవంబర్ 20న పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి మీదుగా ఎగురుతున్న అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్‌ను తమ స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు గుర్తించాయని ఇరాన్ పేర్కొంది. వెంటనే తమ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణిని ప్రయోగించాయని తెలిపింది. ఆ క్షిపణి ఎఫ్-16 విమానానికి అత్యంత సమీపంలో పేలడంతో విమానం దెబ్బతిందని ఇరాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఫలితంగా పైలట్ తన ఆపరేషన్‌ను రద్దు చేసుకుని, సమీపంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చిందని ఇరాన్ సైన్యం వాదించింది. ఫ్లైట్-ట్రాకింగ్ డేటాను ఉటంకిస్తూ వెలువడిన కొన్ని నివేదికల ప్రకారం.. ఆ ఎఫ్-16 విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమీపంలో అత్యవసర పరిస్థితిని సూచించే కోడ్ 7700 ను పంపి, వేగంగా కిందకు దిగి అబుదాబిలోని అల్ ధఫ్రా ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయినట్లు ఇరాన్ మీడియా ప్రచారం చేసింది. దీనికి బలం చేకూర్చేలా, ఒక విమానం వైపు క్షిపణి దూసుకెళ్తున్నట్లు కనిపిస్తున్న వీడియోను కూడా ఇరాన్ సైన్యం విడుదల చేసింది. అయితే ఆ వీడియో నిజానిజాలను ఇప్పటివరకు ఏ స్వతంత్ర సంస్థా ధృవీకరించలేదు. ఇక మిడిల్ ఈస్ట్ లో అమెరికా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించే యూఎస్ సెంట్రల్ కమాండ్ అంటే సెంట్కామ్ శనివారం నాడు సోషల్ మీడియా వేదిక లో ఇరాన్ వాదనకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తమ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని దెబ్బతీసిందని, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిందని చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని సెంట్కామ్ స్పష్టం చేసింది. కేవలం విమానం దెబ్బతినలేదని చెప్పడమే కాదు.. అసలు ఇరాన్ అమెరికా ఎఫ్-16 విమానంపై ఎలాంటి దాడి చేయనేలేదు అని సెంట్కామ్ స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో విధులు నిర్వహిస్తున్న అమెరికా సైనిక యుద్ధ విమానాలన్నీ పూర్తిగా సురక్షితంగా, లెక్క ప్రకారం ఉన్నాయని అమెరికా చెబుతోంది. మరోవైపు ఇరాన్ కూడా దెబ్బతిన్న విమానం నంబర్ గానీ, స్వతంత్రంగా నిర్ధారించదగిన స్పష్టమైన ఆధారాలను గానీ చూపించలేకపోయింది.
పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సైనిక దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయిలోనే కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి ఇరాన్ బలగాలు అమెరికా విమానాలపై దాడులు చేశామని పలుమార్లు ప్రకటించగా, వాషింగ్టన్ వాటిలో అనేక వాదనలను తోసిపుచ్చింది. గత రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. ఈ ఏడాది మార్చి చివర్లో ఇరాన్‌పై జరిగిన సైనిక ఆపరేషన్‌లో పాల్గొన్న ఒక అమెరికా ఎఫ్-16 విమానం ప్రాంతీయ బేస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిందని సెంట్కామ్ ధృవీకరించింది. సరిగ్గా అదే సమయంలో, మధ్య ఇరాన్ మీదుగా వెళ్తున్న అమెరికా అత్యాధునిక ఎఫ్-35 స్టెల్త్ జెట్‌ను తమ గగనతల రక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతీసిందని ఐఆర్జీసీ ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 3న మరో ఎఫ్-35 విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నామని, జూన్‌లో పర్షియన్ గల్ఫ్‌లో తమ గగనతలాన్ని ఉల్లంఘించిన ఒక ఎఫ్-16 జెట్‌పై క్షిపణి ప్రయోగించి తరిమికొట్టామని ఇరాన్ పేర్కొంది. ఇప్పుడు నవంబర్‌లో మళ్లీ ఎఫ్-16 దాడి ప్రచారం తెరపైకి రావడం గమనార్హం.
అమెరికా-ఇరాన్ మధ్య దౌత్య, సైనిక మాటల యుద్ధం కూడా తీవ్రస్థాయికి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు సంపాదించకుండా అడ్డుకునేందుకు టెహ్రాన్‌తో ఒక శాశ్వత ఒప్పందం చేసుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దీనికి ఇరాన్ అంతే ఘాటుగా బదులిచ్చింది. అమెరికా విధిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ఛేదించడానికి తాము ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని ఇరాన్ హెచ్చరించింది. ఆర్థిక దిగ్బంధనం అనేది తమపై శత్రుత్వ చర్య అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ అభివర్ణించారు. మరోవైపు ఇరాన్ సైన్యం ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అక్రమినియా వాషింగ్టన్కు నేరుగా హెచ్చరిక జారీ చేశారు. అమెరికా మళ్లీ ఎలాంటి కొత్త దాడులకు దిగినా తమ సాయుధ దళాల నుంచి రియాక్షన్ గట్టిగా ఉంటుందని, తమ ఆత్మరక్షణ ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితం కాదని ఆయన స్పష్టం చేశారు.



