నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలన నిర్ణయం..రాజ్యాంగంలో కీలక సవరణలు..?

ఎప్పుడూ అగ్రరాజ్యానికే వార్నింగ్‌లు ఇచ్చే కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఆ అమెరికా దెబ్బకే వణికిపోతున్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఎప్పుడూ తాను ఎదుటివారిని భయపెట్టే కిమ్.. ఇప్పుడు తన ప్రాణాల మీదకు ఎక్కడ ముప్పు వస్తుందోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏ క్షణమైనా అమెరికా తనపై విరుచుకుపడొచ్చన్న ఆందోళనతో.. ఏకంగా 54 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా రాజ్యాంగాన్నే మార్చేసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు కిమ్. ఎప్పుడూ అణుదాడి బటన్ తన చేతిలోనే ఉంచుకునే ఆ నియంత.. ఇప్పుడు ఒకవేళ అమెరికా దాడిలో తన ప్రాణాలకు ఏమైనా జరిగినా, శత్రువులపై అణుదాడి ఆగకూడదన్న పక్కా వ్యూహంతో కొత్త చట్టాలను తెరపైకి తెచ్చారు. ఇటీవలి కాలంలో అమెరికా దూకుడు కిమ్ ను కలవరపెట్టినట్లు అర్ధమవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టెహ్రాన్ పై అమెరికా జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోవడం, అలాగే ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఆ దేశ అణు స్థావరాలను నేలమట్టం చేయడం కిమ్ ను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. బంకర్లలో ఉన్నా సరే శత్రువును టార్గెట్ చేయగల టెక్నాలజీ అమెరికా దగ్గర ఉందని ఆయనకు అర్థమైంది. దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం కిమ్‌కు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ట్రంప్ ఒకవైపు తనతో భేటీ అవుతానని, చర్చలు జరుపుతానని చెబుతూనే.. మరోవైపు ఉత్తర కొరియా అణు ఆయుధాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. తన మాట వినకపోతే ఇరాన్‌కు పట్టిన గతే నార్త్ కొరియాకు పడుతుందన్న సిగ్నల్స్ ట్రంప్ ఇండైరెక్ట్‌గా పంపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా ఎప్పుడైనా తమపై యుద్ధం ప్రకటించవచ్చన్న బలమైన అనుమానంతో కిమ్ ముందు జాగ్రత్త చర్యగా రాజ్యాంగ సవరణలకు దిగారు.



