విడిపోతున్నట్లు ప్రకటించిన పవన్ కల్యాణ్, అన్నా లెజ్ నెవా..!

ఎవరూ ఊహించని విధంగా జనసేన అధినేత, పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా కొణిదెల అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. జీవితంలో ఒక కీలకమైన ప్రయాణాన్ని పంచుకున్న ఈ జంట, పరస్పర అవగాహన, అత్యంత గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. హై-వోల్టేజ్ పాలిటిక్స్‌లో, భారీ సినిమాల్లో ఎప్పుడూ వార్తల్లో ఉండే పవన్ కల్యాణ్, తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ చాలా హుందాగా కాపాడుకుంటూ వచ్చారు. గత దశాబ్ద కాలంగా ఆయన చేసిన సుదీర్ఘమైన రాజకీయ పోరాటంలో అన్నా కొణిదెల తెరవెనుక ఒక బలమైన మద్దతుగా నిలిచారు. సెలబ్రిటీల విడాకులు అనగానే ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం, విమర్శలు చేసుకోవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ పవన్ కల్యాణ్, అన్నా తీసుకున్న ఈ నిర్ణయం.. ఆ ప్రకటనలో వాడిన పదాలు వారి హుందాతనానికి నిదర్శనంగా నిలిచాయి. తమ శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు వారు విడుదల చేసిన ప్రకటనలో ఇలా రాసి ఉంది: మా జీవితంలో ఒక ముఖ్యమైన భాగాన్ని కలిసి పంచుకున్న తర్వాత, మేమిద్దరం పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ కష్టకాలంలో వారు తమ పిల్లల పట్ల చూపించిన బాధ్యత ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. భార్యాభర్తలుగా తమ ప్రయాణం ముగిసినప్పటికీ, పిల్లలకు మాత్రం ఒక అంకితభావం కలిగిన తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఎప్పటికీ కొనసాగుతామని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆ పిల్లల ఆనందం, శ్రేయస్సే తమ ఇద్దరి మొదటి ప్రాధాన్యత అని వారు తెలిపారు. తమ జీవితంలో వచ్చిన ఈ మార్పును అర్థం చేసుకుని, తమ ప్రైవసీని గౌరవించాలని పవన్, అన్నా కోరారు. ఇన్ని రోజులు తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఎంతో సున్నితంగా వారు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు.



