అధికారులకు డెడ్ లైన్..దీపావళి తర్వాత రంగంలోకి డిప్యూటీ సీఎం పవన్

ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సమస్య వచ్చినప్పుడు తాత్కాలికంగా హడావిడి చేసి వదిలేయడం కాకుండా.. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైన, పక్కా ప్రణాళికతో ముందుకు వచ్చారు. తాజాగా కాకినాడ జిల్లాపై అర్నబ్ తుపాను తన ప్రతాపం చూపించింది. భారీ గాలులు, వర్షాలతో తీరప్రాంతం వణికిపోయింది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ గా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న సంచలన నిర్ణయాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడుతూ చేసిన ఒక కామెంట్ ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. తుపానులు వచ్చిన ప్రతిసారీ కేవలం తాత్కాలిక చర్యలు చేపట్టి వదిలేయడం వల్ల మత్స్యకారుల జీవితాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. తీర ప్రాంత ప్రజలకు మనం శాశ్వత రక్షణ కల్పించాలి అని ఆయన జిల్లా అధికారులకు స్పష్టం చేశారు. మత్స్యకారులకు పడవే ప్రాణం. ఒక్క పడవ ధ్వంసం అయితే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. లక్షలాది రూపాయలు అప్పు చేసి కొన్న ఆ పడవలు తుపానుల దాటికి ముక్కలైపోతుండటంపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా, మత్స్యకారుల వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, వెంటనే ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. పడవలకు కనుక ఇన్సూరెన్స్ వస్తే, అది ఏపీ మత్స్యకారుల చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజవుతుంది. అంతేకాకుండా, మత్స్యకారుల కష్టాలను ఫైళ్లలో చూసి వదిలేయకుండా.. దీపావళి పండుగ తర్వాత స్వయంగా తనే ఆయా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని పవన్ ప్రకటించడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది.



